తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ భార్య సంగీత విడాకులు మంజూరు చేయాలని కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. గత 26 ఏళ్లుగా ఆదర్శ దంపతులుగా ఉన్న వీరి మధ్య విడాకుల అంశం తెరపైకి రావడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
సినీ నటితో విజయ్‌కు వివాహేతర బంధం
సంగీత తన పిటిషన్లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. విజయ్ ఒక ప్రముఖ సినీ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆ కారణంగానే తాను విడాకులు కోరుతున్నానని ఆమె కోర్టుకు విన్నవించినట్లు తెలుస్తోంది. 2021లోనే ఈ విషయం బయటపడినప్పటికీ, విజయ్ తన ప్రవర్తన మార్చుకోలేదని, సదరు నటితోనే కలిసి ఉంటున్నారని సంగీత ఆరోపించినట్లు సమాచారం. ఈ పరిణామం విజయ్ నైతిక విలువలను ప్రశ్నించేలా చేస్తోంది.
ఎన్నికలకు ముందు విజయ్ ఇమేజ్ పై భారీ దెబ్బ
రాజకీయాల్లోకి ప్రవేశించి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న విజయ్‌కు ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. సాధారణంగా తమిళ రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ విలువలకు ఓటర్లు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి తరుణంలో వివాహేతర బంధం వంటి ఆరోపణలు ఆయన ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
విజయ్ సమర్థించుకోవడం కష్టమే !
ఏప్రిల్ 20న కోర్టుకు రావాలని విజయ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులపై పోరాటం చేస్తూనే, మరోవైపు కోర్టులో తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలను ఎదుర్కోవడం ఆయనకు కత్తి మీద సాము లాంటిదే. ఈ వివాదం నుంచి విజయ్ ఎలా బయటపడతారు? తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా కాపాడుకుంటారు? అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.
