
విద్యార్థి చేతిలో దారుణంగా హత్యకు గురైన ప్రధానోపాధ్యాయురాలు రూపారెడ్డి కుటుంబాన్ని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ప్రతినిధులు పరామర్శించారు. తుర్కయంజాల్ లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల దాడిలో ప్రధానోపాధ్యాయురాలు మృతి చెందడం తీవ్రంగా విచారకరమన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమష్టిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థుల్లో పెడధోరణులు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉపాధ్యాయులకు సహకరించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం మరింత పటిష్టంగా చర్యలు చేపట్టాలని కోరారు.కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి కె. శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రాణి, వి. సుదర్శన్ రెడ్డి, రామకృష్ణతో పాటు కొండా మల్లేపల్లి, నల్గొండ ట్రస్మా సభ్యులు పాల్గొన్నారు.
