
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. బండి రమేష్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు తీర్థప్ర సాదాలను పంపిణీ చేశారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో బండి రమేష్ దంపతులు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంపై హేమ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానిక ప్రజలు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

