
హైదర్‌నగర్ పిల్లర్ నంబర్ 680 సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్ పీజేఆర్ లేఅవుట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నీల లీల సాయి బాలాజీ తండ్రి నీల పూర్ణ కలాధర్ (50) తన స్నేహితుడు జి. సత్యనారాయణ (51)తో కలిసి ద్విచక్ర వాహనంపై చందానగర్ వైపు నుంచి వస్తున్నారు.మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో హైదర్‌నగర్ పిల్లర్ నంబర్ 680 వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన డీసీఎం వాహనం (TS 15 UD 4898) వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ కుడివైపు పడిపోగా, పూర్ణ కలాధర్ ఎడమవైపు పడిపోయారు. డీసీఎం వాహనం వెనుక కుడివైపు టైర్లు పూర్ణ కలాధర్ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన పూర్ణ కలాధర్ను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ వైపు పక్కటెముకలకు తీవ్ర అంతర్గత గాయాలు కావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడి కుమారుడు సాయి బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును ఎస్ఐ ఎం. మల్లేశం దర్యాప్తు చేస్తున్నారు.
