పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి : ట్రస్మా అసోసియేట్ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి
విద్యార్థుల చేతుల్లో దారుణ హత్యకు గురైన రూపారెడ్డి కి తెలంగాణ గుర్తింపు పొందిన ఆఫర్డబుల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రపస) గ్రేటర్ కుత్బుల్లాపూర్ కమిటీ ఘనంగా నివాళులర్పించింది. శుక్రవారం సాయంత్రం కుత్బుల్లాపూర్ రంగారెడ్డి నగర్ లోని బ్రైట్ కాన్సెప్ట్ పాఠశాల ఆవరణలో ఆమె చిత్రపటానికి కోవొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ట్రస్మా అసోసియేట్ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఈ విధంగా తెగపడటం దారుణమన్నారు. ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించడం తరచుగా అక్కడక్కడ వెలుగు చూస్తూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులకు నియంత్రణ లేకపోవడం వాళ్లే ఇలాంటి సంఘటనలకు దారితీస్తుందని వారు వాపోయారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు లాంటి వాటిపై పాఠశాల ఆవరణలో తరచుగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యతాయుతంగా పిల్లల పట్ల వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు చెడు మార్గంలో వెళితే మందలించే హక్కు ఉపాధ్యాయుడికి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కానీ నేటి సమాజంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడమే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. ఉపాధ్యాయుడు ఏమాత్రం మందలించిన, దండించినా తల్లిదండ్రులు వెంటనే ఉపాధ్యాయుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాలు పేరుతో ఉపాధ్యాయుల పట్ల అమానుషంగా వ్యవహరించడతోనే పిల్లలకు ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఉపాధ్యాయునికి గౌరవం పెరిగినప్పుడే ఉత్తమమైన పౌరులుగా పిల్లలు ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో జిల్లా నాయకులు బిర్రు ఆంజనేయులు, భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గడ్డమీది బాలరాజు, నర్సింహాలు, సి హెచ్ నర్సింహా గౌడ్, వీరన్న, మండల సంఘం నాయకులు కోలా వెంకటేష్, వినోద్ జాదవ్, దయాకర్ జనార్దన్, శ్రీశైలం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

