
CDM వద్ద దృష్టి మళ్లించి మోసం.. అలవాటుపడిన నేరస్థుడి అరెస్ట్

కేపీహెచ్‌బీ పోలీసుల కేసు ఛేదన.. రూ.70 వేల నగదు స్వాధీనం

కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లోని ఎస్బీఐ వద్ద CDMలో నగదు జమ చేసేందుకు వచ్చిన 56 ఏళ్ల ఉపాధ్యాయురాలిని దృష్టి మళ్లించి మోసం చేసిన కేసులో కురంగి విద్యాసాగర్ (32)ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.35 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును స్వీకరించిన నాగిపోగు బాలాజీ (35) నుంచి మరో రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకుని నోటీసు జారీ చేశారు.ఈ నెల 13న బాధితురాలు రూ.2 లక్షలతో బ్యాంకుకు వెళ్లగా, తాను బ్యాంకు సిబ్బందినని నమ్మించిన విద్యాసాగర్ CDMలో నగదు జమ చేయడంలో సహాయం చేస్తానని చెప్పి సుమారు రూ.99 వేల నగదును అపహరించాడు. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు ఈ నెల 21న నెక్సస్ మాల్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద పట్టుకున్నారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 19 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో డీఐ భూపాల్ ఆధ్వర్యంలోని క్రైమ్ టీమ్ కీలకంగా పనిచేసిందని, సిబ్బంది పనితీరును ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ అభినందించినట్లు తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంలు, CDMల వద్ద అపరిచితుల సాయం తీసుకోవద్దని, PIN, OTP, ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని SHO విజయ్ కుమార్ సూచించారు.
