ఇస్లామాబాద్: పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వాన్ని “అక్రమ ప్రభుత్వం”గా అభివర్ణిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పాకిస్తాన్లో జరుగుతున్న ఆత్మాహుతి దాడులు మరియు ఉగ్రవాద చర్యల మధ్య స్పష్టమైన సంబంధం ఉందని పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, పాకిస్తాన్లోకి చొరబడి నిరపరాధ పౌరులు మరియు భద్రతా సిబ్బందిపై దాడులు చేయడానికి సహకరిస్తోందని ఆరోపించారు.అఫ్గాన్ ప్రభుత్వం ప్రజల మద్దతు లేకుండా అధికారాన్ని స్వాధీనం చేసుకుందని, ప్రజల మౌలిక హక్కులను హరించిందని ఆయన విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వక్రీకరించి ఉపయోగిస్తున్నారని కూడా తరార్ వ్యాఖ్యానించారు.
ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు మరింత ఉధృతమయ్యాయి. పలు గంటలపాటు కొనసాగిన క్రాస్-బోర్డర్ దాడుల్లో ఇరు దేశాల వైపునా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యం అఫ్గానిస్తాన్ భూభాగంలో ఆపరేషన్ కొనసాగుతోందని ప్రకటించింది.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ పరిస్థితిని “బహిరంగ యుద్ధం”గా అభివర్ణించారు. కాబూల్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తుండగా, సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
